దానియేలు 1:4-19

దానియేలు 1:4-19 TERV

ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైనవారు, తేలికగా విషయాలు నేర్చుకునేవారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతిరోజు రాజు తిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు. ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు యూదా దేశానికి చెందినవారు. తర్వాత అష్పెనజు యూదానుంచి వచ్చిన ఆ యువకులకు బబులోనీయుల పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు అని పేర్లు పెట్టాడు. రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యంతో తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించమని అష్పెనజు అనుమతి కోరాడు. దానియేలుపట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేశాడు. కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించకపోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసువారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు: “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు. పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిర్ణయమో అలాగే చెయ్యి” అని అన్నాడు. అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు. పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు. అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు. దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్త్రాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు. ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకువెళ్లాడు. రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు.