దానియేలు 1:4-19

దానియేలు 1:4-19 OTSA

ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి. రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి. యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు. ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు. అయితే దానియేలు, రాజు ఇచ్చే ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుని తనను తాను అపవిత్రపరచుకోవద్దని నిర్ణయించుకొని, తాను అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తినకుండా ఉండడానికి ప్రధాన అధికారి అనుమతి కోరాడు. ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు. కాబట్టి ఆ అధికారి దానియేలుతో, “మీకు ఆహారం పానీయం కేటాయించిన నా ప్రభువైన నా రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయస్సు యువకుల కంటే మీరు అతనికి ఎందుకు పీక్కుపోయినట్టుగా కనిపించాలి? అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి నా తల నరికేస్తాడు” అన్నాడు. అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు, “దయచేసి పది రోజులపాటు మీ దాసులను పరీక్షించి చూడండి: మాకు కూరగాయలు, త్రాగడానికి నీళ్లు తప్ప ఏమి ఇవ్వకండి. ఆ తర్వాత రాజాహారం తిన్న యువకులతో మా ముఖాలను పోల్చి చూసిన తర్వాత మీకు నచ్చినట్లు మాకు చేయండి” అని అన్నాడు. అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు. పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు. కాబట్టి ఆ నాయకుడు రాజు ఆహారాన్ని, వారు త్రాగవలసిన ద్రాక్షరసాన్ని తీసివేసి వారికి కూరగాయలు పెట్టాడు. ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. వారిని రాజు సేవకై తీసుకువచ్చే సమయం సమీపించినప్పుడు, ప్రముఖ అధికారి వారిని నెబుకద్నెజరు సమక్షంలో నిలబెట్టాడు. రాజు వారితో మాట్లాడారు, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకు సమానం ఎవరూ లేరని కనుగొన్నాడు; కాబట్టి వారిని రాజు సేవకు నియమించాడు.