ఆమోసు 5:18-27

ఆమోసు 5:18-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? కాంతితో కాక చీకటిగా ఉండదా? మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు. నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి. ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా? మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, అని యెహోవా చెబుతున్నాడు. ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

షేర్ చేయి
Read ఆమోసు 5

ఆమోసు 5:18-27 పవిత్ర బైబిల్ (TERV)

మీలో కొంతమంది యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు. అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు? యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు! ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు! ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా పాము కరచినవాని మాదిరి మీరుంటారు! కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు! ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది. “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! నేను వాటిని అంగీకరించను! మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను! మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు నేను కనీసం చూడనైనా చూడను. మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి. మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను. మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి. మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి. ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాలపాటు నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు. కాని మీరు మీ రాజుయొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు. పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు. కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.

షేర్ చేయి
Read ఆమోసు 5

ఆమోసు 5:18-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము. ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధానబలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు.

షేర్ చేయి
Read ఆమోసు 5

ఆమోసు 5:18-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది. అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది. యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా? “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను. మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను. మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను. అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి. “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా? మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది. కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

షేర్ చేయి
Read ఆమోసు 5