ఆమోసు 5:18-27

ఆమోసు 5:18-27 IRVTEL

యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? కాంతితో కాక చీకటిగా ఉండదా? మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు. నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి. ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా? మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, అని యెహోవా చెబుతున్నాడు. ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.