ఆమోసు 5:18-27

ఆమోసు 5:18-27 OTSA

యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది. అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది. యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా? “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను. మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను. మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను. అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి. “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా? మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది. కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

Read ఆమోసు 5