2 తిమోతికి 2:14-26
2 తిమోతికి 2:14-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని ఎదుట వారిని హెచ్చరించు. ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు. దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు. వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు. వారు సత్యానికి దూరమయ్యారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు. అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.” ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి. అదే విధంగా, తమను తాము శుద్ధి చేసుకునేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కోసం సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు. యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు. మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు. ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు. దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి. అప్పుడు వారు తమ తప్పును తెలుసుకుని, తన ఇష్టాన్ని చేయడానికి వారిని చెరలోనికి తీసుకెళ్లిన సాతాను ఉచ్చులో నుండి తప్పించుకోగలరు.
2 తిమోతికి 2:14-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో. భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు. అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది. ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి. ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు. నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి. ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.
2 తిమోతికి 2:14-26 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు. విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు. ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది. గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు. యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.
2 తిమోతికి 2:14-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు–పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. – ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు – ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము. సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
2 తిమోతికి 2:14-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)