2 తిమోతి పత్రిక 2:14-26

2 తిమోతి పత్రిక 2:14-26 IRVTEL

వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో. భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు. అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది. ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి. ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు. నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి. ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.