2 సమూయేలు 12:1-13
2 సమూయేలు 12:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను–ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని–యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱెపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి–ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగా–నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయిం తును అనెను. –నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
2 సమూయేలు 12:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి. బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది. ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.” దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. “యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు. వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు. నాతాను దావీదును చూసి “ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని. నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు. నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది. నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను. పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు. అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు.
2 సమూయేలు 12:1-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లలతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది. “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.” ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు. “ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఇచ్చాను కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.” “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది. నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.” నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు. అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు.
2 సమూయేలు 12:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు. ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకున్నాడు. అది అతని దగ్గర అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది త్రాగుతూ అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలా ఉండేది. “ఒక రోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకుని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు” అని చెప్పాడు. అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి! వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు. అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని. యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు. నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’ “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు. నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు. అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.