2 సమూ 12:1-13

2 సమూ 12:1-13 IRVTEL

యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి. బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది. ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.” దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. “యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు. వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు. నాతాను దావీదును చూసి “ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని. నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు. నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది. నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను. పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు. అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు.