2 సమూయేలు 12:1-13

2 సమూయేలు 12:1-13 OTSA

కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు. ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకున్నాడు. అది అతని దగ్గర అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది త్రాగుతూ అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలా ఉండేది. “ఒక రోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకుని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు” అని చెప్పాడు. అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి! వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు. అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని. యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు. నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’ “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు. నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు. అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.

Read 2 సమూయేలు 12