2 రాజులు 5:1-14
2 రాజులు 5:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను. ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని– చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలురాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.
2 రాజులు 5:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సిరియా రాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజు దృష్టిలో గొప్పవాడూ, గౌరవనీయుడూ అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడూ, బలవంతుడూ అయినప్పటికీ అతడు కుష్టు రోగి. సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవారు. ఒకసారి వారు అక్కడనుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయింది. ఆ అమ్మాయి తన యజమానురాలితో “షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా యజమాని కుష్టురోగాన్ని నయం చేస్తాడు” అంది. కాబట్టి నయమాను తన రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు. సిరియా రాజు “నీవు వెళ్ళు. నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను” అన్నాడు. నయమాను తనతో మూడు వందల నలభై కిలోల వెండీ, ఆరు వేల తులాల బంగారం, పది జతల బట్టలూ తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకు వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి అందించాడు. ఆ లేఖలో “నా సేవకుడైన నయమానుకి ఉన్న కుష్టురోగాన్ని నీవు బాగు చేయాలి. అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను” అని ఉంది. ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. “ఒక మనిషికి ఉన్న కుష్టురోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషులను చంపడానికీ బ్రతికించడానికీ నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది” అన్నాడు. ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొన్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి “నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతణ్ణి నా దగ్గరికి పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు” అని సందేశం పంపించాడు. కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు. ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు. నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు. అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.
2 రాజులు 5:1-14 పవిత్ర బైబిల్ (TERV)
సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.” నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు. అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు. అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.” ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.” ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు. నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు. కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.” అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
2 రాజులు 5:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి. అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది. ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది. నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు. అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల వెండి, ఆరువేల షెకెళ్ళ బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు. అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు తీసుకెళ్లిన ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఈ ఉత్తరంతో పాటు నా సేవకుడైన నయమానును నీ దగ్గరకు పంపిస్తున్నాను, అతనికి ఉన్న కుష్ఠును మీరు బాగుచేయాలని కోరుతున్నాను.” ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు. దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.” కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు. ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు. అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు. నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది.