సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను. ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని– చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలురాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.
Read 2 రాజులు 5
వినండి 2 రాజులు 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 రాజులు 5:1-14
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు