2 రాజులు 5
5
1సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలియైయుండెనుగాని అతడు కుష్ఠరోగి. 2సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 3అది–షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. 4నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా 5సిరియా రాజు–నేను ఇశ్రాయేలురాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొనిపోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను. 6ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా–నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రి కను అతనిచేత నీకు పంపించియున్నాను. 7ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని– చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. 8ఇశ్రాయేలురాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు–నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. 9నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా 10ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 11అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 12దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. 13అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 14అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 15అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి–చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా 16ఎలీషా –ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసి కొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను. 17అప్పుడు–యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా? 18నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా 19ఎలీషా–నెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.
20అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ– సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని 21నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొని– క్షేమమా అని అడిగెను. అతడు–క్షేమమే అని చెప్పి 22–నా యజమానుడు నాచేత వర్తమానము పంపి–ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. 23అందుకు నయమాను–నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి. 24మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి. 25అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి–గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు–నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను. 26అంతట ఎలీషా వానితో–ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? 27కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 5: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.