2 దినవృత్తాంతములు 20:20-30
2 దినవృత్తాంతములు 20:20-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను. నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు. ఈలాగున యెహోవావారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి; వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.
2 దినవృత్తాంతములు 20:20-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు. అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు. వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది. నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు. ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు. ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
2 దినవృత్తాంతములు 20:20-30 పవిత్ర బైబిల్ (TERV)
తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!” యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భుతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు. “యెహోవాకు భజన చేయండి; ఆయన ప్రేమ తరగనిది!” అంటూ వారు సంకీర్తన చేశారు. ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు. యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు. శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు. తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు. వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు. అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
2 దినవృత్తాంతములు 20:20-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు” ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.” వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు. ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు. కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది. నాలుగో రోజు వారు బెరాకా లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటు నేటి వరకు బెరాకాలోయ అని పిలువబడుతుంది. అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు. వారు యెరూషలేములో ప్రవేశించి, రకరకాల సితార వీణలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకున్నారు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా ఎలా పోరాడారో విన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ దేవుని భయం కలిగింది. యెహోషాపాతు రాజ్యం సమాధానంతో ఉంది, ఎందుకంటే యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చారు.