వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు. అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు. వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది. నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు. ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు. ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
Read 2 దిన 20
వినండి 2 దిన 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దిన 20:20-30
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు