తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!” యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భుతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు. “యెహోవాకు భజన చేయండి; ఆయన ప్రేమ తరగనిది!” అంటూ వారు సంకీర్తన చేశారు. ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు. యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు. శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు. తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు. వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు. అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
Read 2 దినవృత్తాంతములు 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దినవృత్తాంతములు 20:20-30
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు