2 దినవృత్తాంతములు 2:1-6
2 దినవృత్తాంతములు 2:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సొలొమోను యెహోవా నామఘనతకొరకు ఒక మందిరమును తన రాజ్యఘనతకొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసికొని బరువులు మోయుటకు డెబ్బది వేలమందిని, కొండలమీద మ్రానులు కొట్టుటకు ఎనుబదివేల మందిని ఏర్పరచుకొని వీరిమీద మూడువేల ఆరువందలమందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–నా తండ్రియైన దావీదు నివాసమునకై యొక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళ మ్రానులను సిద్ధముచేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగానుండును; మా దేవుడు సకలమైన దేవతలకంటె మహనీయుడు గనుక ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్ట దలచియున్నాను.
2 దినవృత్తాంతములు 2:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు. అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు. నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను. మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది. అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.
2 దినవృత్తాంతములు 2:1-6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు. తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు: “నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం. “మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
2 దినవృత్తాంతములు 2:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు. సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు. తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి. ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి. “మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.