2 దినవృత్తాంతములు 2

2
దేవాలయ నిర్మాణానికి సిద్ధపాటు
1సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు. 2సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు.
3తూరు రాజైన హీరాముకు#2:3 హెబ్రీలో హీరాము మరో రూపం హూరాము సొలొమోను ఇలా కబురు పంపాడు.
“నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి. 4ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.
5“మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది. 6అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.
7“యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి.
8“లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు. 9నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి. 10దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా 20,000 కోరుల#2:10 అంటే, సుమారు 3,600 టన్నులు గోధుమ పిండిని, 20,000 కోరుల#2:10 అంటే, సుమారు 3,000 టన్నులు యవలు, 20,000 బాతుల#2:10 అంటే, సుమారు 4,40,000 లీటర్లు ద్రాక్షరసం, 20,000 బాతుల ఒలీవనూనె ఇస్తాను.”
11దానికి జవాబుగా తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక లేఖ వ్రాశాడు.
“యెహోవా తన ప్రజలను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే నిన్ను వారిమీద రాజుగా నియమించాడు.”
12అందుకు హీరాము,
“ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన స్తుతిపాత్రుడు! ఆయన రాజైన దావీదుకు బుద్ధిగల కుమారున్ని ఇచ్చారు. ఆ కుమారుడు జ్ఞానం, వివేకం గలవాడై, యెహోవా పేరిట మందిరం, తనకు రాజభవనం కట్టిస్తాడు.
13“మీ దగ్గరకు హూరాము-అబి అనే జ్ఞానంగల వ్యక్తిని పంపిస్తున్నాను. అతడు గొప్ప నేర్పుగలవాడు. 14అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు.
15“నా యజమానులైన మీరు చెప్పినట్టే ఇప్పుడు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసం మీ సేవకులకిచ్చి పంపించండి. 16మీరు కావాలన్న దూలాలను మేము లెబానోను అడవుల నుండి నరికి సముద్రం మీద తెప్పలుగా కట్టి, యొప్ప పట్టణం దాకా తెస్తాము. అక్కడినుండి మీరు వాటిని యెరూషలేముకు తీసుకెళ్లవచ్చు.”
17సొలొమోను ఇశ్రాయేలులో ఉంటున్న పరాయి దేశస్థుల జనాభా లెక్కలు తీయించాడు. తన తండ్రియైన దావీదు చేయించిన లెక్కల ప్రకారం అలాంటి వారికి లెక్కించినప్పుడు మొత్తం 1,53,600 మంది ఉన్నారు. 18వారిలో బరువులు మోయడానికి 70,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి 80,000 మందిని నియమించాడు. పని సక్రమంగా జరిగేటట్టు చూడడానికి 3,600 మందిని పనివారి మీద అధికారులుగా నియమించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

2 దినవృత్తాంతములు 2 కోసం వీడియో