2 దిన 2:1-6

2 దిన 2:1-6 IRVTEL

సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు. అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు. నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను. మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది. అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.