1 సమూయేలు 30:1-8

1 సమూయేలు 30:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి, పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు. దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు. యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు. “నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 30

1 సమూయేలు 30:1-8 పవిత్ర బైబిల్ (TERV)

దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు. సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు. దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు. దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు. దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు. సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమార్తెలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు. యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు. అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారిని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 30

1 సమూయేలు 30:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి, ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి. దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను. –నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 30

1 సమూయేలు 30:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు. ఆడవారిని, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అక్కడున్న అందరిని బందీలుగా పట్టుకుని, వారిని చంపకుండా తమతో పాటు తీసుకెళ్లారు. దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు. ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు. అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు. అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 30