1 సమూయేలు 30:1-8

1 సమూయేలు 30:1-8 OTSA

దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు. ఆడవారిని, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అక్కడున్న అందరిని బందీలుగా పట్టుకుని, వారిని చంపకుండా తమతో పాటు తీసుకెళ్లారు. దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు. ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు. అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు. అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.

Read 1 సమూయేలు 30