1 సమూ 30:1-8

1 సమూ 30:1-8 IRVTEL

దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి, పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు. దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు. యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు. “నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.