1 సమూయేలు 19:1-17

1 సమూయేలు 19:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు. నేను బయటకు వెళ్లి నీవు ఉన్న పొలంలో మా నాన్నతో పాటు నిలబడి అతనితో నీ గురించి మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న వాటిని నీకు చెప్తాను” అని అన్నాడు. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు. అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు. సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును పిలిచి అన్ని సంగతులను అతనికి చెప్పి, దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గతంలో ఉన్నట్లే దావీదు అతని దగ్గర ఉన్నాడు. మరొకసారి యుద్ధం వచ్చినప్పుడు దావీదు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపినప్పుడు వారు అతని దగ్గర నుండి పారిపోయారు. యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. అప్పుడు సౌలు చేతిలో ఈటె పట్టుకుని తన ఇంట్లో కూర్చున్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు. ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి, మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు. తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది. సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది. సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు. అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది. అప్పుడు సౌలు, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని మీకాలును అడిగాడు. అందుకు మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.

షేర్ చేయి
Read 1 సమూయేలు 19

1 సమూయేలు 19:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు. అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో. నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను” అన్నాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు. అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?” అని చెప్పినప్పుడు, సౌలు యోనాతాను చెప్పింది విని “యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను” అని ప్రమాణం చేశాడు. అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియచేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినపుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు. తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి, చాలామందిని చంపేశాడు. యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే, సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు. ఉదయాన్నే అతణ్ణి చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు “ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని చెప్పి కిటికీగుండా దావీదును కిందికి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు. తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది. సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు “అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు” అని చెప్పింది. దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి “అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను” అన్నాడు. ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది. అప్పుడు సౌలు “నా శత్రువు తప్పించుకుపోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు” అని మీకాలును అడిగితే, మీకాలు “నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావ్, ‘నన్ను వెళ్లనివ్వు’ అని దావీదు తనతో చెప్పాడు” అని సౌలుతో చెప్పింది.

షేర్ చేయి
Read 1 సమూయేలు 19

1 సమూయేలు 19:1-17 పవిత్ర బైబిల్ (TERV)

దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు. యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు. నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసుకున్నదంతా నీకు చెబ తాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు. దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు. యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు. కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు. మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు. కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు. సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు. సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది. అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారిపోయాడు. మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది. దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది. ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు. సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు. “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు. “తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.

షేర్ చేయి
Read 1 సమూయేలు 19

1 సమూయేలు 19:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొనిపోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదుమునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యముగలిగి యీటె విసి రెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు –ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా–అతడు రోగియై యున్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి–నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు–తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు–నే నెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 19