1 సమూయేలు 19
19
1అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా 2సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. 3నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను. 4యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. 5అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా 6సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను. 7అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొనిపోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదుమునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. 8తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా 9యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా 10సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యముగలిగి యీటె విసి రెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను. 11ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు –ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి 12కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. 13తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి 14సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా–అతడు రోగియై యున్నాడని చెప్పెను. 15దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి–నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా 16ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను. 17అప్పుడు సౌలు–తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు–నే నెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.
18ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి. 19దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా 20దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి. 21ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెనుగాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెనుగాని వారును ప్రకటించుచుండిరి. 22కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చి–సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు–రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను. 23అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను, 24మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 19: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.