సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు. నేను బయటకు వెళ్లి నీవు ఉన్న పొలంలో మా నాన్నతో పాటు నిలబడి అతనితో నీ గురించి మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న వాటిని నీకు చెప్తాను” అని అన్నాడు. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు. అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు. సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును పిలిచి అన్ని సంగతులను అతనికి చెప్పి, దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గతంలో ఉన్నట్లే దావీదు అతని దగ్గర ఉన్నాడు. మరొకసారి యుద్ధం వచ్చినప్పుడు దావీదు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపినప్పుడు వారు అతని దగ్గర నుండి పారిపోయారు. యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. అప్పుడు సౌలు చేతిలో ఈటె పట్టుకుని తన ఇంట్లో కూర్చున్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు. ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి, మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు. తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది. సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది. సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు. అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది. అప్పుడు సౌలు, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని మీకాలును అడిగాడు. అందుకు మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.
చదువండి 1 సమూయేలు 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 19:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు