1 రాజులు 10:1-8

1 రాజులు 10:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

షేబదేశపురాణి యెహోవా నామమునుగూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను. షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును, అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను–నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే; అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి; నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు.

షేర్ చేయి
Read 1 రాజులు 10

1 రాజులు 10:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది. ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికి సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు. షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని, అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు. ఆమె రాజుతో ఇలా అంది. “నీవు చేసిన పనుల గురించీ నీ జ్ఞానం గురించీ నా దేశంలో నేను విన్న మాట నిజమే. కానీ నేను వచ్చి నా కళ్ళారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్నదానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి. నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు!

షేర్ చేయి
Read 1 రాజులు 10

1 రాజులు 10:1-8 పవిత్ర బైబిల్ (TERV)

షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది. అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది. సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు. షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది. రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి. కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది! నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి. నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది!

షేర్ చేయి
Read 1 రాజులు 10

1 రాజులు 10:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

షేబ దేశపు రాణి సొలొమోను యొక్క ఖ్యాతి గురించి యెహోవాతో అతనికి ఉన్న సంబంధం గురించి విని చిక్కు ప్రశ్నలతో సొలొమోనును పరీక్షిద్దామని వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు. షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానమంతటిని, అతడు కట్టించిన రాజభవనాన్ని, అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, అతనికి పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది. ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, ఇక్కడున్న వాటిలో సగం కూడా నాకు చెప్పలేదు; జ్ఞానంలోను, ధనంలోను నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!

షేర్ చేయి
Read 1 రాజులు 10