1 రాజులు 10
10
1షేబదేశపురాణి యెహోవా నామమునుగూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను. 2ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా 3ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను. 4షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును, 5అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై 6రాజుతో ఇట్లనెను–నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే; 7అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి; 8నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు. 9నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. 10మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. 11మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. 12ఈ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. 13సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
14ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు. 15ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకులయొద్దనుండియు అరబి రాజులయొద్ద నుండియు దేశాధికారులయొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను. 16రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను. 17మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను. 18మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను. 19ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్వములయందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను. 20ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. 21మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబా నోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు. 22సముద్రమందు హీరాము ఓడలతోకూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను. 23ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను. 24అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి. 25ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులుగాని, బంగారపు వస్తువులుగాని, వస్త్రములుగాని, యుద్ధాయుధములుగాని, గంధవర్గములుగాని, గుఱ్ఱములుగాని, కంచరగాడిదలుగాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను. 26మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను; అతడు వెయ్యిన్ని నాలుగువందల రథములును పండ్రెండువేల రౌతులునుగలవాడై యుండెను; వీటిని అతడు రథములకై యేర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను. 27రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను. 28సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి. 29వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 10: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.