1 రాజులు 10:1-8

1 రాజులు 10:1-8 TERV

షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది. అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది. సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు. షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది. రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి. కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది! నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి. నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది!

Read 1 రాజులు 10