1 దినవృత్తాంతములు 29:1-20

1 దినవృత్తాంతములు 29:1-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది. నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను. పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి: భవనాల గోడలకు పూత వేయడానికి, బంగారపు పనికి, వెండి పనికి, పనివారు చేసే ప్రతి పనికి మూడువేల తలాంతుల ఓఫీరు బంగారం, ఏడువేల తలాంతుల శుద్ధి చేసిన వెండి. ఇప్పుడు, యెహోవాకు మనస్పూర్తిగా సమర్పించుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా?” అప్పుడు కుటుంబ నాయకులు, ఇశ్రాయేలు గోత్రాల అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనుల మీద నియమించబడిన అధికారులు అందరు ఇష్టపూర్వకంగా సమర్పించారు. వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు. ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు. దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు: “యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా! యుగయుగాల వరకు మీకు స్తుతి కలుగును గాక. యెహోవా! మహాత్మ్యం, ప్రభావం, వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి. ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే. యెహోవా రాజ్యం మీదే; మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు. ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి; మీరు సమస్తానికి పాలకులు. అందరిని హెచ్చించి, బలపరచడానికి మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి. మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము. “అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము. మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది. యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే. నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను. యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి. నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.” తర్వాత దావీదు సమావేశమైన వారందరితో, “మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వారందరూ తమ పూర్వికుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా ఎదుట, రాజు ఎదుట తలలు వంచి, సాగిలపడ్డారు.

1 దినవృత్తాంతములు 29:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత రాజైన దావీదు సంఘంతో “దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది. నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను. ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను. గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను. ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు. అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు. తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం. ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం. మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు. మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే. నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి. నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు” అన్నాడు. ఈ విధంగా అన్న తరువాత దావీదు “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.

1 దినవృత్తాంతములు 29:1-20 పవిత్ర బైబిల్ (TERV)

అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. ఆరువేల మణుగుల ఓఫీరు దేశపు బంగారాన్ని, పద్నాలుగు వేల మణుగుల శుద్ధమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?” కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు. సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము. గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు. భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము! ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము. మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాటసారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు. యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే. నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను. ఓ దేవా, నీవు మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి. నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము. వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము. నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము. నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము. ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.” పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకు, రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.

1 దినవృత్తాంతములు 29:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెను–దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుగాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారుచేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? అప్పుడు పితరులయిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి. తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమ కూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచు న్నాను. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును, నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. ఈలాగు పలికిన తరువాత దావీదు–ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమపితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

1 దినవృత్తాంతములు 29:1-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)