అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది. నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను. పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి: భవనాల గోడలకు పూత వేయడానికి, బంగారపు పనికి, వెండి పనికి, పనివారు చేసే ప్రతి పనికి మూడువేల తలాంతుల ఓఫీరు బంగారం, ఏడువేల తలాంతుల శుద్ధి చేసిన వెండి. ఇప్పుడు, యెహోవాకు మనస్పూర్తిగా సమర్పించుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా?”
అప్పుడు కుటుంబ నాయకులు, ఇశ్రాయేలు గోత్రాల అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనుల మీద నియమించబడిన అధికారులు అందరు ఇష్టపూర్వకంగా సమర్పించారు. వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు. ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు.
దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు:
“యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా!
యుగయుగాల వరకు
మీకు స్తుతి కలుగును గాక.
యెహోవా! మహాత్మ్యం, ప్రభావం,
వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి.
ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే.
యెహోవా రాజ్యం మీదే;
మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.
ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి;
మీరు సమస్తానికి పాలకులు.
అందరిని హెచ్చించి, బలపరచడానికి
మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.
మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ,
మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.
“అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము. మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది. యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే. నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను. యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి. నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”
తర్వాత దావీదు సమావేశమైన వారందరితో, “మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వారందరూ తమ పూర్వికుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా ఎదుట, రాజు ఎదుట తలలు వంచి, సాగిలపడ్డారు.