1 దినవృత్తాంతములు 29:1-20

1 దినవృత్తాంతములు 29:1-20 TERV

అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. ఆరువేల మణుగుల ఓఫీరు దేశపు బంగారాన్ని, పద్నాలుగు వేల మణుగుల శుద్ధమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?” కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు. సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము. గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు. భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము! ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము. మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాటసారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు. యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే. నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను. ఓ దేవా, నీవు మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి. నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము. వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము. నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము. నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము. ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.” పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకు, రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.