ఆది 24
24
ఇస్సాకు రిబ్కా
1అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు. 2అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు. 3-4నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.
5అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు.
6అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు. 7నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు. 8ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు. 9ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు.
10అప్పుడు ఆ సేవకుడు యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, యజమాని యొక్క అన్ని రకాల శ్రేష్ఠమైన వస్తు సముదాయాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అరాము నహరయీముకు#24:10 అంటే, వాయువ్య మెసొపొటేమియా బయలుదేరి, నాహోరు పట్టణం చేరాడు. 11పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము.
12అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా! నా యజమానియైన అబ్రాహాము దేవా, నేను వచ్చిన పని ఈ రోజు సఫలం చేయండి, నా యజమాని అబ్రాహాముపై దయ చూపండి. 13నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు. 14నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.”
15అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె. 16రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది.
17ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి, “నీ కుండలోని నీళ్లు కొన్ని నాకు త్రాగడానికి ఇవ్వు” అని అన్నాడు.
18“అయ్యా త్రాగండి” అని అంటూ రిబ్కా వెంటనే కుండను చేతి మీదికి దించుకుని, అతనికి నీళ్లు ఇచ్చింది.
19అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది. 20కాబట్టి ఆమె త్వరపడి తన కుండలో నీళ్లు తొట్టిలో పోసి, పరుగెత్తుకుంటూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్లి, ఒంటెలన్నిటికి సరిపడే నీళ్లు చేది పోసింది. 21ఆ సేవకుడు ఒక్క మాట మాట్లాడకుండా, యెహోవా తన ప్రయాణం సఫలం చేశారా లేదా అని ఆమెను గమనిస్తూ ఉన్నాడు.
22ఒంటెలు నీళ్లు త్రాగిన తర్వాత, అతడు ఒక బెకా#24:22 అంటే 5.7 గ్రాములు బరువుగల బంగారం ముక్కుపుడక, పది షెకెళ్ళ#24:22 అంటే 115 గ్రాములు బరువుగల రెండు బంగారు కడియాలు చేతిలో పట్టుకున్నాడు. 23అప్పుడతడు, “నీవెవరి కుమార్తెవు? దయచేసి చెప్పు, ఈ రాత్రి నీ తండ్రి ఇంట్లో మేము గడపడానికి స్థలం ఉందా?” అని అడిగాడు.
24అందుకు ఆమె, “నేను మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను” అని జవాబిచ్చింది. 25“మీరు బసచేయడానికి కావలసిన స్థలం, మీ ఒంటెలకు మేత కూడా మా ఇంట్లో ఉంది” అని కూడా చెప్పింది.
26అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాను ఆరాధిస్తూ, 27“నా యజమానియైన అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతి, ఆయన నా యజమానికి తన దయను, తన నమ్మకత్వాన్ని చూపడం మానలేదు. నా మట్టుకైతే, యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు” అని అన్నాడు.
28ఆ యవ్వన స్త్రీ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి ఇంటివారికి ఈ సంగతులన్ని చెప్పింది. 29రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు. 30లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు. 31“యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.
32కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు. 33అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు.
అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.
34అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను. 35యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు. 36నా యజమాని భార్య శారా తన వృద్ధాప్యంలో కుమారున్ని కన్నది, తన ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు. 37నా యజమాని నాతో ప్రమాణం చేయించి, ‘నీవు నా కుమారునికి నేను నివసించే కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకురాకూడదు, 38అయితే నా తండ్రి ఇంటికి, నా బంధువుల దగ్గరకు వెళ్లి, నా కుమారునికి భార్యను తీసుకురా’ అని చెప్పాడు.
39“అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను.
40“అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు. 41నీవు మా వంశస్థుల దగ్గరకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు ఆమెను ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, నీకు ఈ ప్రమాణం నుండి విముక్తి’ అని అన్నాడు.
42“ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి. 43ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే, 44ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను.
45“నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.
46“త్వరగా ఆమె కడవ భుజం మీది నుండి దింపుకుని, ‘త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తాను’ అని అన్నది. కాబట్టి నేను త్రాగాను ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసింది.
47“అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను.
“అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది.
“అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి, 48తలవంచి నేను యెహోవాను ఆరాధించాను; నా యజమాని సోదరుని మనవరాలిని తన కుమారునికి భార్యగా తీసుకురావడానికి నన్ను సరియైన మార్గంలో నడిపించిన నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవాను స్తుతించాను. 49ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు.
50అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, “ఇది యెహోవా చేసిన కార్యం; ఈ విషయంలో మేము చెప్పేది ఏమి లేదు. 51ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకెళ్లండి. యెహోవా సూచించినట్లే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవును గాక.”
52అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు. 53తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు. 54అప్పుడు అతడు, అతని మనుష్యులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు.
మర్నాడు ఉదయం వారు లేచినప్పుడు, అతడు, “నా దారిన నన్ను నా యజమాని దగ్గరకు పంపివేయండి” అని అన్నాడు.
55అయితే ఆమె తల్లి సోదరుడు, “యువతిని కనీసం పదిరోజులైనా మా దగ్గర ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్లిపోవచ్చు” అని అన్నారు.
56కాని అతడు, “యెహోవా నా ప్రయాణం సఫలం చేశారు, కాబట్టి ఆలస్యం చేయకుండా నన్ను పంపివేయండి, నా యజమాని దగ్గరకు నేను వెళ్తాను” అన్నాడు.
57అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు. 58కాబట్టి వారు రిబ్కాను పిలిచి, “ఇతనితో నీవు వెళ్తావా?” అని అడిగారు.
అందుకు ఆమె, “నేను వెళ్తాను” అని జవాబిచ్చింది.
59కాబట్టి వారు తమ సోదరి రిబ్కాను, ఆమెకు తోడుగా దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను పంపివేశారు. 60వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు,
“మా సోదరీ, నీవు వర్ధిల్లాలి,
వేవేల మందికి తల్లివి కావాలి;
నీ సంతానపు వారు
తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.”
61అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు.
62ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు. 63ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి. 64రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి, 65“మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది.
అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది.
66ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు. 67ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆది 24: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.