మార్కు సువార్త 9

9
1యేసు ఇంకా మాట్లాడుతూ, “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
రూపాంతరము
2ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని ఒంటరిగా ఎత్తైన కొండ మీదికి వెళ్లారు, అక్కడ వారి ముందు ఆయన రూపాంతరం చెందారు. 3ఆయన వస్త్రాలు మిరుమిట్లుగొలిపేంత తెల్లగా మారాయి, లోకంలో ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగా. 4అప్పుడు మోషే, ఏలీయా ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ వారికి కనబడ్డారు.
5పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. 6అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు.
7అప్పుడు మేఘం వారిని కమ్ముకుంది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు. ఈయన మాటలను వినండి!”
8అకస్మాత్తుగా, వారు చుట్టూ చూసినప్పుడు, తమతో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు.
9వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు. 10“చనిపోయి తిరిగి బ్రతకడం” అనే మాట మీద వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ, ఆ విషయాన్ని తమ మధ్యలోనే ఉంచుకున్నారు.
11వారు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు.
12అందుకు యేసు, “ఏలీయా ముందుగా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. అలాంటప్పుడు మనుష్యకుమారుడు అధికంగా హింసను అనుభవించి తృణీకరించబడతాడని ఎందుకు వ్రాయబడింది? 13అయితే నేను మీతో చెప్తున్న, ఏలీయా ముందే వచ్చాడు, అతని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు” అని అన్నారు.
అపవిత్రాత్మ పట్టిన బాలున్ని స్వస్థపరచిన యేసు
14వారు ఇతర శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, వారి చుట్టూ గొప్ప జనసమూహం ఉండడం ధర్మశాస్త్ర ఉపదేశకులు వారితో వాదిస్తుండడం చూశారు 15ప్రజలందరు యేసును చూసిన వెంటనే, వారు ఆశ్చర్యంతో మునిగిపోయి ఆయనను పలకరించడానికి పరుగెత్తారు.
16యేసు, “మీరు దేని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగారు.
17ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను. 18అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని మీ శిష్యులను అడిగాను కాని వారిచేత కాలేదు” అన్నాడు.
19అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు.
20కాబట్టి వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు.
21యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు.
అతడు, “వాని చిన్నతనం నుండే. 22అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు.
23అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు.
24వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు.
25ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు.
26అప్పుడు ఆ అపవిత్రాత్మ పెద్ద కేక వేసి, వాన్ని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ పిల్లవాడు చచ్చిన వానిలా పడి ఉండడం చూసి చాలామంది, “వాడు చనిపోయాడు” అనుకున్నారు. 27కానీ యేసు వాని చేయి పట్టుకుని లేవనెత్తారు, అప్పుడు వాడు లేచి నిలబడ్డాడు.
28యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.
29అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన#9:29 కొ.ప్ర.లలో ప్రార్థన ఉపవాసం ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు.
రెండవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
30వారు ఆ స్థలాన్ని వదిలి గలిలయ ప్రాంతం గుండా వెళ్లారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి, 31తాము ఎక్కడ ఉన్నామో ఎవనికి తెలియకూడదని అనుకున్నారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను చంపుతారు, మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. 32అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.
33వారు కపెర్నహూముకు వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన వారిని, “మీరు త్రోవలో దేని గురించి వాదించుకుంటున్నారు?” అని అడిగారు. 34కాని వారు మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు.
35యేసు కూర్చుని, పన్నెండుమందిని తన దగ్గరకు పిలుచుకొని, “ఎవడైనా మొదటివానిగా ఉండాలని అనుకుంటే వాడు అందరిలో చివరివాడై, అందరికి దాసునిగా ఉండాలి” అని వారితో అన్నారు.
36ఆయన ఒక చిన్నబిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలబెట్టి, ఆ చిన్నబిడ్డను తన కౌగిటిలో ఎత్తుకుని, వారితో ఈ విధంగా చెప్పారు, 37ఎవరైనా ఈ చిన్నబిడ్డల్లో ఒకనిని నా పేరట చేర్చుకుంటారో, వారు నన్ను చేర్చుకున్నట్టే; అలాగే నన్ను చేర్చుకొన్న వారు నన్నే కాదు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే.
మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడు
38యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపివేయమని చెప్పాము, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు.
39అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు. 40మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడు. 41మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేరట ఒక గిన్నెడు నీళ్లను మీకు ఇచ్చినా వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
ఆటంకం కలిగిస్తే
42“ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే, వారి మెడకు తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. 43నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి కారణమైతే, దానిని నరికి పారవేయి. ఎందుకంటే నీవు రెండు చేతులు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, ఒక చేతితో నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. 44ఆ నరకంలో,
“ ‘వారిని తినే పురుగులు చావవు
అగ్ని ఆరదు.’#9:44 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
45నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. 46ఆ నరకంలో,
“ ‘వారిని తినే పురుగులు చావవు
అగ్ని ఆరదు.’#9:46 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు
47నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు. 48ఆ నరకంలో,
“ ‘వారిని తినే పురుగులు చావవు,
అగ్ని ఆరదు.’#9:48 యెషయా 66:24
49ప్రతి ఒక్కరు అగ్నితో ఉప్పు సారం పొందుకొంటారు.
50“ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, నీవు దానిని తిరిగి ఎలా సారవంతం చేయగలవు? మీలో మీరు ఉప్పును కలిగి ఉండండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మార్కు సువార్త 9: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

మార్కు సువార్త 9 కోసం వీడియోలు