మార్కు సువార్త 10

10
విడాకులు
1యేసు కపెర్నహూము నుండి యూదయ ప్రాంతానికి యొర్దాను నది అవతల ఉన్న ప్రాంతానికి వెళ్లారు. మళ్ళీ ప్రజల గుంపు ఆయన దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన ఎప్పటిలాగే వారికి బోధించారు.
2కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.
3అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు.
4వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు.
5అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కోసం వ్రాశాడు. 6సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగాను స్త్రీగాను’#10:6 ఆది 1:27 సృజించారు. 7‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, 8అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’#10:8 ఆది 2:24 కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. 9కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.
10వారందరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శిష్యులు వీటి గురించి యేసుని వివరంగా చెప్పమని అడిగారు. 11ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, “తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు. 12అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.”
చిన్న పిల్లలు, యేసు
13ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు. 14యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. 15ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. 16అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.
ధనవంతుడు, దేవుని రాజ్యం
17యేసు బయలుదేరి వెళ్తునప్పుడు, ఒక మనిషి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్లూని, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
18అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. 19మీకు ఆజ్ఞలు తెలుసు: ‘హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి#10:19 నిర్గమ 20:12-16; ద్వితీ 5:16-20’ ” అని అన్నారు.
20అందుకు అతడు, “బోధకుడా, నేను నా బాల్యం నుండే వీటన్నిటిని ఆచరిస్తున్నాను” అన్నాడు.
21యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, “నీలో ఒక కొరత ఉంది. నీవు వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.
22ఆ మాటతో అతడు ముఖం చిన్నబుచ్చుకుని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తి కలవాడు.
23యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో!” అన్నారు.
24ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడ్డారు కాని యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో! 25ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
26ఇది విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, ఒకరితో ఒకరు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అనుకున్నారు.
27యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!” అన్నారు.
28అప్పుడు పేతురు, “మేము అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము!” అన్నాడు.
29అందుకు యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా కోసం సువార్త కోసం ఎవరైతే తమ ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలాలను విడిచిపెడతారో, 30వారు హింసతో పాటు ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను, పొలాలను ఈ ప్రస్తుత యుగంలో రానున్న యుగంలో నిత్యజీవాన్ని వందరెట్లు పొందుకొంటారు. 31అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.
మూడవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
32వారు యెరూషలేముకు వెళ్తున్నారు, యేసు వారికి ముందు నడుస్తున్నారు, ఆయనను వెంబడించినవారు భయపడుతూ ఉంటే, శిష్యులు విస్మయమొందారు. యేసు మళ్ళీ తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి తనకు జరగబోయే సంగతులను వారికి చెప్పారు. 33“మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్య యాజకులకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. 34వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి చంపేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
యాకోబు యోహానుల విన్నపము
35జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా, మేమేది అడిగినా నీవు మాకోసం అది చేయాలని మేము కోరుతున్నాం” అని అన్నారు.
36ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు.
37వారు ఆయనతో, “నీ మహిమలో మా ఇద్దరిలో ఒకడు నీ కుడి వైపున ఇంకొకడు నీ ఎడమవైపున కూర్చోపెట్టుకో” అన్నారు.
38యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా లేదా నేను పొందిన బాప్తిస్మం మీరు పొందగలరా?” అని అడిగారు.
39వారు, “మేము చేయగలం” అని జవాబిచ్చారు.
అప్పుడు యేసు వారితో, “నేను త్రాగే గిన్నెలోనిది మీరు తప్పక త్రాగుతారు నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారు, 40కాని నా కుడి వైపున లేదా ఎడమవైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం సిద్ధపరచబడి ఉన్నాయో వారికే చెందుతాయి” అని వారితో అన్నారు.
41ఇది విన్న తక్కిన పదిమంది శిష్యులు, యాకోబు యోహానుల మీద కోప్పడ్డారు. 42యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో, “యూదేతరుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారని వారి ఉన్నతాధికారులు వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు. 43కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి, 44అలాగే మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు అందరికి దాసునిగా ఉండాలి. 45ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నారు.
చూపును పొందుకొనిన గ్రుడ్డి బర్తిమయి
46ఆ తర్వాత వారు యెరికో పట్టణం చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, గొప్ప జనసమూహంతో కలిసి, పట్టణం విడిచి వెళ్తుండగా, తిమయి కుమారుడైన బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. 47వాడు నజరేయుడైన యేసు అక్కడ ఉన్నాడని విని, “దావీదు కుమారుడా యేసూ, నా మీద దయ చూపించు!” అని కేకలు వేయడం మొదలుపెట్టాడు.
48అనేకులు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
49అప్పుడు యేసు ఆగి, “వాన్ని పిలువండి” అన్నారు.
వారు ఆ గ్రుడ్డివానితో, “సంతోషించు! లేచి రా! ఆయన నిన్ను పిలుస్తున్నారు” అన్నారు. 50అప్పుడు వాడు తన పైవస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు.
51యేసు వాన్ని, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు.
అప్పుడు ఆ గ్రుడ్డివాడు, “బోధకుడా, నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52అందుకు యేసు, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మార్కు సువార్త 10: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

మార్కు సువార్త 10 కోసం వీడియోలు