యెహోషువ 24:14-23

యెహోషువ 24:14-23 OTSA

“ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి. అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.” అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక! మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు. ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.” యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు. ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.” అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు. అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు. అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు. “అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు.