యోవేలు 2:12-17

యోవేలు 2:12-17 OTSA

యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.” మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు. ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు? సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి. ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”

Read యోవేలు 2