యోవేలు 2:12-17
యోవేలు 2:12-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
యోవేలు 2:12-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
యోవేలు 2:12-17 పవిత్ర బైబిల్ (TERV)
ఇది యెహోవా సందేశం: “ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి. మీరు చెడ్డ పనులు చేసారు. ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి. మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోండి.” మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో ప్రేమఉంది. ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో. ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు. మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో. అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు. సీయోనులో బూర ఊదండి. ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి. ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లను సమావేశపరచండి. చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి. పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని వారి పడకగదినుండి బయటకు రప్పించండి. యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ ‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”
యోవేలు 2:12-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.” మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు. ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు? సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి. ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”