యెషయా 14
14
1యెహోవా యాకోబుపై జాలి చూపుతారు;
ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని
వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు.
విదేశీయులు వారిని కలుసుకుంటారు
యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.
2ప్రజలు వారిని తీసుకువచ్చి
వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు.
ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని
యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు.
వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని
తమను బాధించిన వారిని పాలిస్తారు.
3నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున, 4నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు:
బాధ పెట్టినవాడు ఎలా నశించాడు!
రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!
5దుర్మార్గుల దుడ్డుకర్రను
పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.
6వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో
ప్రజలను క్రూరంగా కొట్టారు,
కోపంతో ప్రజలను పరిపాలించి
కనికరం లేకుండా వారిని అణచివేశారు.
7భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది;
వారు పాడడం మొదలుపెట్టారు.
8సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు
నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి,
“నీవు పడుకుంటున్నప్పటి నుండి
మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.”
9నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి
క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది;
అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా
భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది;
దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని
తమ సింహాసనాలు నుండి లేపుతుంది.
10వారందరు నిన్ను చూసి
నీతో ఇలా అంటారు,
“నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు;
నీవు కూడా మాలా అయ్యావు.”
11నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా
క్రింద సమాధిలో పడవేయబడింది;
నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయి
క్రిములు నిన్ను కప్పివేస్తాయి.
12తేజోనక్షత్రమా, వేకువచుక్కా,
నీవెలా ఆకాశం నుండి పడ్డావు?
దేశాలను పడగొట్టిన నీవు
భూమి మీద ఎలా పడవేయబడ్డావు?
13నీవు నీ హృదయంలో,
“నేను ఆకాశాలను ఎక్కుతాను;
దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా
నా సింహాసనాన్ని హెచ్చిస్తాను;
ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద,
సాఫోన్#14:13 సాఫోన్ కనానీయుల చేత అతి పవిత్ర పర్వతముగా పరిగణించబడింది. పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.
14మేఘ మండలం మీదికి ఎక్కుతాను.
నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు.
15కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో
లోతైన గోతిలో త్రోయబడ్డావు.
16నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ
నీ విధి గురించి ఇలా అనుకుంటారు:
“భూమిని కంపింపజేసి
రాజ్యాలను వణికించింది ఇతడేనా?
17లోకాన్ని అడవిగా చేసి
దాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా?
తాను బంధించిన వారిని తమ ఇళ్ళకు పోనివ్వనివాడు ఇతడేనా?”
18దేశాల రాజులందరూ ఘనత వహించినవారై
తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు.
19అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా
నీ సమాధి నుండి పారవేయబడ్డావు.
నీవు చంపబడినవారితో
కత్తితో పొడవబడిన వారితో
పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు.
కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.
20నీవు నీ దేశాన్ని పాడుచేసి
నీ ప్రజలను చంపేశావు
కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు.
దుర్మార్గుని సంతానం
ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.
21వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని
తమ పట్టణాలతో భూమిని నింపకుండా
తమ పూర్వికుల పాపాన్ని బట్టి
అతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి.
22“నేను వారి మీదికి లేస్తాను” అని
సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు,
“బబులోను పేరును దానిలో మిగిలినవారిని,
సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను”
అని యెహోవా తెలియజేస్తున్నారు.
23“నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను
నీటిమడుగులుగా చేస్తాను;
నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని
సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
24సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే:
“నేను ఉద్దేశించినట్లే అది తప్పక ఉంటుంది,
నేను ఆలోచించినట్లే అది జరుగుతుంది.
25నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను;
నా పర్వతాలమీద అతన్ని నలగదొక్కుతాను.
అతని కాడి నా ప్రజల మీద నుండి తీసివేయబడుతుంది,
అతని భారం వారి భుజాలపై నుండి తొలగించబడుతుంది.”
26లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే;
ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.
27సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు?
ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?
ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం
28రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం:
29ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర
విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి;
సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది,
దాని సంతానం ఎగిరే విషసర్పము.
30అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు,
అవసరతలో ఉన్నవారు క్షేమంగా పడుకుంటారు.
కాని కరువుతో మీ మూలాన్ని నాశనం చేస్తాను;
అది మీలో మిగిలి ఉన్నవారిని చంపేస్తుంది.
31గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి!
ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి!
ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది.
పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.
32ఆ దేశ దూతలకు
ఇవ్వవలసిన జవాబు ఏది?
“యెహోవా సీయోనును స్థాపించారు,
ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 14: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.