యెహెజ్కేలు 47
47
మందిరంలో నుండి ప్రవహించే నది
1ఆ మనుష్యుడు నన్ను ఆలయ ద్వారం దగ్గరకు తిరిగి తీసుకువచ్చాడు, అక్కడ ఆలయ గుమ్మం క్రిందనుండి తూర్పు వైపుకు నీరు రావడం నేను చూశాను (మందిరం తూర్పు ముఖంగా ఉంది). ఆ నీరు ఆలయానికి దక్షిణం వైపున క్రింది నుండి, బలిపీఠానికి దక్షిణం నుండి వస్తుంది. 2తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి, తూర్పు వైపున ఉన్న బయటి ద్వారం దగ్గరకు నన్ను నడిపించాడు, అక్కడ ఆ నీరు దక్షిణం వైపు నుండి పారుతుంది.
3ఆ వ్యక్తి తన చేతిలో కొలమానం పట్టుకుని తూర్పు వైపు వెళ్తుండగా, అతడు వెయ్యి మూరలు#47:3 అంటే, సుమారు 530 మీటర్లు కొలిచాడు, ఆపై చీలమండల లోతు ఉన్న నీటి గుండా నన్ను నడిపించాడు. 4అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీటి గుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్లు నడుము వరకు వచ్చాయి. 5అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది. 6“మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?”
ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు. 7నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు కనిపించాయి. 8అతడు నాతో ఇలా అన్నాడు, “ఈ నీరు తూర్పు ప్రాంతం వైపు ప్రవహిస్తూ అరాబా#47:8 లేదా యొర్దాను లోయ లోకి వెళ్తుంది, అక్కడ అది మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఉప్పునీరు మంచి నీటిగా మారుతుంది. 9ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది. 10ఎన్-గేదీ నుండి ఎన్-ఎగ్లయీము వరకు చేపలు పట్టేవారు ఒడ్డున నిలబడి వలలు వేస్తారు. మధ్యధరా సముద్రంలో ఉన్నట్లు అన్ని రకాల చేపలు మృత సముద్రంలో ఉంటాయి. 11కానీ బురద మడుగులు, చిత్తడి నేలలు శుద్ధి చేయబడవు; అవి ఇంకా ఉప్పుగానే ఉంటాయి. 12నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.”
దేశ సరిహద్దులు
13ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా మీరు పంచుకునే దేశ సరిహద్దులు, యోసేపుకు రెండు వంతులు. 14నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది.
15“ఇది దేశానికి సరిహద్దుగా ఉంటుంది:
“ఉత్తరం వైపున ఇది మధ్యధరా సముద్రం నుండి హెత్లోను రహదారి ద్వారా లెబో హమాతు దాటి సెదాదు వరకు ఉంటుంది, 16తర్వాత అది దమస్కు హమాతు మధ్య సరిహద్దులో ఉన్న బెరోతా సిబ్రాయిము వరకు, చివరకు హౌరాను సరిహద్దులో ఉన్న హజెర్-హత్తికోను వరకు వెళ్తుంది. 17సముద్రం నుండి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు వున్న హజర్-ఎనానుకు#47:17 ఎనానుకు మరో రూపం ఎనోను వెళ్తుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు.
18తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది.
19దక్షిణం వైపున అది తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళుతుంది. ఇది దక్షిణ సరిహద్దు అవుతుంది.
20పడమటి వైపున, మధ్యధరా సముద్రం లెబో హమాతుకు ఎదురుగా ఉన్న చోటుకు సరిహద్దుగా ఉంటుంది. ఇది పశ్చిమ సరిహద్దు అవుతుంది.
21“ఇశ్రాయేలు ప్రజ గోత్రాల ప్రకారం దేశాన్ని నీవు పంచాలి. 22మీరు దానిని మీకు మీ మధ్య నివసిస్తూ పిల్లలను కన్న విదేశీయులకు వారసత్వంగా పంచుకోవాలి. మీరు వారిని స్థానిక ఇశ్రాయేలీయులుగా పరిగణించాలి; మీతో పాటు వారికి ఇశ్రాయేలు గోత్రాల మధ్య వారసత్వం ఇవ్వబడుతుంది. 23ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 47: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.