యెహెజ్కేలు 46
46
1“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఆరు పని దినాల్లో తూర్పు ముఖంగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం మూసివేయబడాలి, అయితే సబ్బాతు దినాన అమావాస్య రోజున దానిని తెరవాలి. 2యువరాజు బయటి మంటప గుమ్మం ద్వారా ప్రవేశించి గుమ్మం ద్వారబంధాల దగ్గర నిలబడాలి. యాజకులు అతని దహనబలిని, సమాధానబలులను అర్పించాలి. అతడు గుమ్మం దగ్గర ఆరాధన చేసి నమస్కరించి బయటకు వెళ్లాలి, కాని సాయంత్రం వరకు ద్వారాన్ని మూసివేయకూడదు. 3సబ్బాతులలో, అమావాస్యల్లో దేశ ప్రజలు ఆ ద్వారం దగ్గర నిలబడి యెహోవాను ఆరాధించాలి. 4సబ్బాతు దినాన యువరాజు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఆరు మగ గొర్రెపిల్లలను ఒక పొట్టేలును అర్పించాలి. 5పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని భోజనార్పణగా అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి. 6అమావాస్య నాడు అతడు ఒక కోడెను, ఆరు గొర్రెపిల్లలను, ఒక పొట్టేలును లోపం లేనివాటిని అర్పించాలి. 7అతడు భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి. 8యువరాజు ప్రవేశించినప్పుడు, అతడు మంటప గుమ్మం ద్వారా లోపలికి వెళ్లాలి అదే దారిలో బయటకు రావాలి.
9“ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి. 10యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి. 11పండుగల్లో, నియమించబడిన సమయాల్లో, భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.
12“ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.
13“ ‘ప్రతిరోజు మీరు యెహోవాకు దహనబలిగా ఏ లోపం లేని ఒక సంవత్సరం వయస్సున్న గొర్రెపిల్లను అందించాలి. ప్రతి ఉదయం మీరు దానిని ఏర్పాటు చేయాలి. 14మీరు దానితో ప్రతి ఉదయం భోజనార్పణను ఏర్పాటు చేయాలి, పిండిని తేమగా ఉంచడానికి ఒక ఏఫాలో#46:14 అంటే, సుమారు 2.7 కి. గ్రా. లు. ఆరవ వంతు నూనెతో పాటు, ఒక హిన్‌లో#46:14 అంటే, సుమారు 1.3 లీటర్లు మూడింట ఒక వంతు నూనె ఉంటుంది. ఈ భోజనార్పణను యెహోవాకు సమర్పించడమనేది నిత్య కట్టుబాటుగా ఉంటుంది. 15కాబట్టి ప్రతిరోజు ఉదయం క్రమమైన దహనబలి కోసం గొర్రెపిల్లను, భోజనార్పణను, నూనెను అందించాలి.
16“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము. 17ఒకవేళ సేవకునికి ఇస్తే అది విడుద సంవత్సరం వరకే సేవకుని ఆధీనంలో ఉంటుంది. అప్పుడది తిరిగి అధిపతికే వస్తుంది. అది పతి వారసత్వం భూమి అతని సంతతి వారిదే! 18ప్రజలను వారి స్వాస్థ్యంలో నుండి బయటకు వెళ్లగొట్టి, వారి వారసత్వంలో నుండి అధిపతి ఏదీ తీసుకోకూడదు. అధిపతి తన భూమిలో నుండి తన కుమారునికి భాగాలివ్వాలి. దేవుని ప్రజల్లో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకూడదు.’ ”
19ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు. 20అతడు నాతో ఇలా అన్నారు: “అపరాధ పరిహారార్థబలి, పాపపరిహారబలి వండి, భోజనార్పణ కాల్చడానికి, బయటి ఆవరణంలోనికి వాటిని తీసుకురాకుండా, ప్రజలను పవిత్రం చేయడానికి యాజకులు ఉండే స్థలం ఇది.”
21అప్పుడు అతడు నన్ను బయటి ఆవరణానికి తీసుకువచ్చి దాని నాలుగు మూలలకు నన్ను నడిపించాడు, నేను ప్రతి మూలలో మరొక ఆవరణాన్ని చూశాను. 22బయటి ఆవరణం యొక్క నాలుగు మూలల్లో నలభై మూరల పొడవు, ముప్పై మూరల వెడల్పు#46:22 అంటే, సుమారు 21 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఆవరణాలు ఉన్నాయి; నాలుగు మూలల్లో ఒక్కో ఆవరణం ఒకే పరిమాణంలో ఉంది. 23నాలుగు ఆవరణాల ప్రతి లోపలి భాగంలో ఒక రాతి గట్టు ఉంది, దాని చుట్టూ గట్టు క్రింద పొయ్యిలున్నాయి. 24ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 46: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.