ప్రసంగి 1

1
ప్రతిదీ అర్థరహితమే
1దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు:
2ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు,
“అర్థరహితం! అర్థరహితం!
అంతా అర్థరహితమే.”
3సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన
వారికి కలిగే లాభం ఏమిటి?
4తరాలు వస్తాయి తరాలు పోతాయి,
కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది.
5సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు,
తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు.
6గాలి దక్షిణం వైపు వీస్తూ
అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది;
అది సుడులు సుడులుగా తిరుగుతూ,
తన దారిలోనే తిరిగి వస్తుంది.
7నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి,
అయినా సముద్రం ఎప్పటికీ నిండదు.
నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో
అక్కడికే తిరిగి వెళ్తాయి.
8అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి,
మనుష్యులు దానిని వివరించలేరు.
ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు.
ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు.
9ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది,
ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది;
సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.
10“చూడండి! ఇది క్రొత్తది”
అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా?
చాలా కాలం క్రితమే, అది ఉంది;
మన కాలానికి ముందే అది ఉంది.
11పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు,
రాబోయే తరాలు కూడా
వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు
అసలే జ్ఞాపకముండవు.
జ్ఞానం అర్థరహితం
12ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను. 13ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు! 14సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.
15వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము;
లేనివాటిని లెక్కపెట్టలేము.
16“చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను. 17ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
18జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది;
ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రసంగి 1: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి