కొలొస్సీ పత్రిక 3

3
క్రీస్తులో జీవం కలిగినవారిలా జీవించుట
1మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు. 2భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి. 3ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. 4మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.
5కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి. 6వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది.#3:6 కొ.ప్రా.ప్ర.లలో అవిధేయుల మీదికి వస్తుంది 7ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు. 8కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. 9మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు, 10సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. 11ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు.
12కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. 13ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. 14వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి.
15ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి. 16సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి. 17మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
క్రైస్తవ కుటుంబాలకు సూచనలు
18భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.
19భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.
20పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము.
21తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.
22బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాల్లో వారికి లోబడి ఉండండి. 23మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి. 24మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు. 25తప్పు చేసినవారికి, వారి తప్పులను బట్టి తగిన శిక్ష ఇవ్వబడుతుంది, ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కొలొస్సీ పత్రిక 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

కొలొస్సీ పత్రిక 3 కోసం వీడియో