కొలొస్సీ పత్రిక 2

2
1మీ కోసం లవొదికయలో ఉన్న వారి కోసం, వ్యక్తిగతంగా నన్ను కలుసుకొనని వారందరి కోసం నేను ఎంతగా కష్టపడుతున్నానో మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. 2వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము. 3బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. 4ఇంపైన మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదని దీనిని మీకు చెప్తున్నాను. 5నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కాని, ఆత్మలో మీతో కూడా ఉండి, మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూసి ఆనందిస్తున్నాను.
క్రీస్తులో ఆత్మీయ పరిపూర్ణత
6కాబట్టి, మీరు క్రీస్తు యేసును ప్రభువుగా అంగీకరించినట్టుగా, ఆయనలో వేరుపారి బలపడుతూ, 7మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.
8క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి.
9ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది. 10మీరు క్రీస్తులో పరిపూర్ణతలోనికి తీసుకురాబడ్డారు. సమస్త బలానికి అధికారానికి ఆయనే శిరస్సు. 11మానవ చేతులతో చేయబడని సున్నతిని క్రీస్తులో మీరు పొందారు. క్రీస్తు చేత మీరు సున్నతి చేయబడినప్పుడు, మిమ్మల్ని పరిపాలిస్తున్న మీ శరీర పాప స్వభావం కొట్టివేయబడింది. 12ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.
13మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు, 14మనకు వ్యతిరేకంగా ఉండి, మనల్ని శిక్షకు గురి చేసే రుణపత్రాన్ని రద్దుచేశారు; ఆయన దానిని తీసివేసి, దానిని సిలువకు మేకులతో కొట్టారు. 15ఆయన సిలువ ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించారు.
మానవ నియమాల నుండి విడుదల
16కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి. 17ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది. 18ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు. 19వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.
20మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!” 21అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు? 22ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి. 23అలాంటి నియమాలు, వారి స్వయంకృత ఆరాధన విషయంలో, అతి వినయం విషయంలో, శరీరాన్ని హింసించుకోవడం జ్ఞానంగా అనిపించవచ్చు, కాని శారీరక ఆశలను చంపుకోవడంలో అలాంటి నియమాలకు ఎలాంటి విలువలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కొలొస్సీ పత్రిక 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

కొలొస్సీ పత్రిక 2 కోసం వీడియో