2 రాజులు 7

7
1అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక#7:1 అంటే, 5.5 కి. గ్రా. లు సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల#7:1 అంటే, 9 కి. గ్రా. లు యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.
2రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు.
అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.
ముట్టడి ఎత్తివేయబడింది
3అప్పుడు పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు, వారు ఒకరితో ఒకరు, “మనం చచ్చేంతవరకు ఎందుకు ఇక్కడ ఉండాలి? 4ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు.
5సంధ్యా సమయంలో వారు లేచి అరామీయుల శిబిరానికి వెళ్లారు. వారు ఆ శిబిరం పొలిమేరకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. 6ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు. 7కాబట్టి వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలని తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను ఎక్కడివి అక్కడే శిబిరంలో వదిలిపెట్టి తెల్లవారక ముందే చీకట్లోనే పారిపోయారు.
8ఆ కుష్ఠురోగులు శిబిరం దగ్గరకు వచ్చి ఒక గుడారంలోకి వెళ్లి అందులో తిని త్రాగారు. తర్వాత వారు వెండి, బంగారం, దుస్తులను తీసుకెళ్లి దాచారు. వారు తిరిగివచ్చి ఇంకొక గుడారంలోకి వెళ్లి, అందులో నుండి వస్తువులు తీసుకెళ్లి వాటిని దాచిపెట్టారు.
9అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.
10కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు. 11ఆ ద్వారపాలకులు, ఆ వార్త బిగ్గరగా కేకలువేస్తూ రాజభవనంలో ఉన్నవారికి తెలియజేశారు.
12రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
13అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.
14కాబట్టి వారు రెండు రథాలను, వాటి గుర్రాలను తీసుకున్నారు. రాజు వారిని అరాము సైన్యం వెనుక పంపుతూ, “మీరు వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోండి” అని వారిని ఆదేశించాడు. 15వారు అరాము సైన్యం వెంట యొర్దాను వరకు వెళ్లారు, దారి పొడవున అరామీయులు పారిపోయే తొందరలో బట్టలు సామాన్లు పారవేసి వెళ్లారు. కాబట్టి రాజు పంపిన దూతలు తిరిగివచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు. 16అప్పుడు ప్రజలు బయటకు వెళ్లి అరామీయుల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారమే, షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్మబడింది.
17రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకున్నాడో, ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకునిగా నియమించాడు, ద్వారం దగ్గర ప్రజలు అతన్ని త్రొక్కగా అతడు చనిపోయాడు. రాజు తన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్టే ఇది జరిగింది. 18దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.
19అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు. 20ఆ అధిపతికి అదే జరిగింది, ఎందుకంటే ప్రజలు ద్వారం దగ్గర అతన్ని త్రొక్కివేశారు, అతడు చనిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి