2 రాజులు 6

6
గొడ్డలి తేలుట
1ప్రవక్తల బృందం వారు ఎలీషాతో, “చూడండి, మిమ్మల్ని కలుసుకునే ఈ స్థలం ఇరుకుగా ఉంది. 2మీరు ఒప్పుకుంటే మేము యొర్దానుకు వెళ్లి తలా ఒక దూలం తీసుకువచ్చి మనం కలుసుకోవడానికి ఒక స్థలాన్ని కడతాం” అన్నారు.
ఎలీషా, “వెళ్లండి” అన్నాడు.
3అప్పుడు వారిలో ఒకడు, “దయచేసి మీ దాసులైన మాతో కూడా రండి” అన్నాడు.
ఎలీషా, “నేను వస్తాను” అన్నాడు. 4కాబట్టి అతడు వారితో వెళ్లాడు.
వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు. 5వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, “అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!” అని కేక పెట్టాడు.
6దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది. 7అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు.
ఎలీషా అరామీయులకు గ్రుడ్డితనం కలుగచేయుట
8అరాము రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడు తన అధికారులతో చర్చించిన తర్వాత, “నేను ఫలాన స్థలాల్లో నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
9దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు సందేశం పంపి, “ఫలాన స్థలానికి వెళ్లవద్దు, ఎందుకంటే అక్కడ అరామీయులు తమ బలగాలను ఉంచారు” అని తెలియజేశాడు. 10కాబట్టి ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఎలీషా పదే పదే రాజును హెచ్చరించగా అతడు అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్త వహించాడు.
11ఇది అరాము రాజుకు కోపం కలిగించింది. అతడు తన అధికారులను పిలిపించి, “నాకు చెప్పండి! ఎవరు మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఉన్నారు?” అని అడిగాడు.
12“మాలో ఎవరు లేరు, నా ప్రభువా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్త మీరు మీ పడకగదిలో మాట్లాడే మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు” అని అతని అధికారులలో ఒకడు చెప్పాడు.
13“వెళ్లండి, అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. అప్పుడు అతన్ని పట్టుకోడానికి నేను మనుష్యులను పంపిస్తాను” అని రాజు ఆదేశించాడు. అతడు దోతానులో ఉన్నాడని వార్త వచ్చింది. 14అప్పుడు అతడు గుర్రాలను, రథాలను, గొప్ప బలగాన్ని అక్కడికి పంపాడు. వారు రాత్రి వెళ్లి ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు.
15మరుసటిరోజు దైవజనుని సేవకుడు పెందలకడ లేచి బయటకు వెళ్లినప్పుడు, పట్టణం చుట్టూ గుర్రాలు, రథాలు కలిగిన సైన్యం ఉండడం చూశాడు. “అయ్యో, నా ప్రభువా! మనం ఏం చేద్దాం?” అని ఆ సేవకుడు అడిగాడు.
16అందుకు ప్రవక్త, “భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది” అన్నాడు.
17అప్పుడు ఎలీషా, “యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.
18శత్రువు అతనివైపు వస్తుండగా, ఎలీషా యెహోవాకు ప్రార్థన చేస్తూ, “ఈ ప్రజలకు గుడ్డితనం కలుగజేయండి” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఎలీషా అడిగినట్టుగా వారికి గుడ్డితనం కలుగజేశారు.
19ఎలీషా వారితో, “ఇది దారి కాదు, ఇది పట్టణం కాదు. నా వెంబడి రండి, మీరు వెదికే మనిషి దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను” అని అన్నాడు. అతడు వారిని సమరయకు తీసుకెళ్లాడు.
20వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఎలీషా, “యెహోవా, వీరు చూచేటట్టు వీరి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వారి కళ్లు తెరవగా తాము సమరయలో ఉన్నట్లు వారు గ్రహించారు.
21ఇశ్రాయేలు రాజు వారిని చూసి, “వీరిని చంపనా, నా తండ్రి? వీరిని చంపనా?” అని ఎలీషాను అడిగాడు.
22అందుకు అతడు, “నీవు వారిని చంపకూడదు, నీ ఖడ్గంతో, వింటితో బందీలుగా తెచ్చిన వారిని చంపుతావా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగి తమ యజమాని దగ్గరికి వెళ్లేలా వారికి భోజనం పెట్టి, నీళ్ళు ఇవ్వు” అని చెప్పాడు. 23కాబట్టి అతడు వారికి గొప్ప విందు చేసి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాడు. వారు తమ యజమాని దగ్గరకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అరామీయుల దోపిడి మూకలు ఇశ్రాయేలు సరిహద్దులను ఆక్రమించడం మానుకొన్నాయి.
ముట్టడి చేయబడిన సమరయలో కరువు
24కొంతకాలం తర్వాత, అరాము రాజైన బెన్-హదదు తన సైన్యం అంతటిని పోగుచేసి, సమరయను ముట్టండించాడు. 25సమరయలో తీవ్రమైన కరువు వచ్చింది; గాడిద తలను ఎనభై షెకెళ్ళ#6:25 అంటే, 920 గ్రాములు వెండికి, పావు కాబ్#6:25 అంటే, 100 గ్రాములు గువ్వ రెట్టను అయిదు షెకెళ్ళ#6:25 అంటే, 58 గ్రాములు వెండికి అమ్మారు.
26ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం దగ్గర నడుస్తూ ఉంటే, ఒక స్త్రీ, “నా ప్రభువా, రాజా, నాకు సహాయం చేయండి!” అంటూ కేక పెట్టింది.
27రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు. 28తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు.
ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది. 29కాబట్టి నా కుమారుని వండుకుని తిన్నాము. మరుసటిరోజు నేను ఆమెతో, ‘నీ కుమారుని ఇవ్వు వాన్ని తిందాం’ అన్నాను, కాని ఆమె తన కుమారుని దాచుకుంది” అని చెప్పింది.
30రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు. 31అతడు, “ఈ రోజు షాపాతు కుమారుడైన ఎలీషా మెడమీద అతని తల ఉంటే, దేవుడు నాకు చాలా కీడు చేయును గాక!” అన్నాడు.
32అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అతనితో పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక దూతను పంపాడు, కాని అతడు ఎలీషాను చేరకముందే, ఎలీషా ఆ పెద్దలతో, “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీరు చూడట్లేదా? చూడండి, ఆ దూత రాగానే తలుపు మూసి అతన్ని లోపలికి రానివ్వకండి. అతని వెంట అతని యజమాని పాదాల శబ్దం వస్తుంది కదా” అని చెప్పాడు. 33ఎలీషా వారితో ఇంకా మాట్లాడుతుండగానే, ఆ దూత అతని దగ్గరకు వచ్చాడు.
రాజు, “ఈ ఆపద యెహోవా నుండి వచ్చింది. నేను యెహోవా కోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 6: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి