1 రాజులు 6
6
సొలొమోను మందిరాన్ని నిర్మించుట
1ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల#6:1 కొ.ప్రా.ప్ర.లలో నాలుగు వందల నలభై సంవత్సరాలు తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.
2రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు.#6:2 అంటే, 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల ఎత్తు 3మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు. 4అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు. 5ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు. 6క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు,#6:6 అంటే, 2.3, మీటర్లు రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు#6:6 అంటే, 2.7 మీటర్లు, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు.#6:6 అంటే, 3.2 మీటర్లు గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు.
7మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు.
8క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. 9అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు. 10అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి.
11యెహోవా వాక్కు సొలొమోనుతో, 12“నీవు కట్టించే ఈ మందిరం విషయంలో, నీవు నా శాసనాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికి లోబడితే, నేను నీ తండ్రియైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను. 13ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను, నా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టను” అని చెప్పారు.
14సొలొమోను మందిరం కట్టించడం ముగించాడు. 15మందిరం లోపలి గోడలను, అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలను, నేలను సరళవృక్షాల పలకలను పరిచారు. 16అతడు మందిరం వెనుక భాగంలో నేల నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో ఇరవై మూరల ఎత్తు గర్భాలయాన్ని అనగా అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. 17అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న విశాల గది పొడవు నలభై మూరలు. 18మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుండ్రని పండ్లు, విచ్చుకున్న పువ్వులు చెక్కారు; అంతా దేవదారు కర్ర పనే ఉంది గాని రాయి ఒక్కటి కూడా కనిపించదు.
19అతడు మందిరం లోపల యెహోవా నిబంధన మందసం పెట్టడానికి గర్భాలయాన్ని సిద్ధపరిచాడు. 20గర్భాలయం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దాని లోపలంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా చేయించాడు. 21సొలొమోను మందిరం లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, గర్భాలయం ముందు భాగానికి బంగారు గొలుసుల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. 22మందిరం లోపలి భాగం పూర్తిగా బంగారంతో పొదిగించాడు. గర్భాలయానికి సంబంధించిన బలిపీఠాన్ని కూడా బంగారంతో పొదిగించాడు.
23గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల#6:23 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి. 24మొదటి కెరూబుకు ఒక్కో రెక్క పొడవు అయిదు మూరలు, ఒక రెక్క కొన నుండి ఇంకొక రెక్క కొన వరకు పది మూరలు. 25రెండవ కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులు ఒకే కొలతతో ఒకే ఆకారంతో ఉన్నాయి. 26ఒక్కో కెరూబు ఎత్తు పది మూరలు. 27అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొని ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను, మరో కెరూబు రెక్క ఇంకొక గోడను తాకుతూ గది మధ్యలో వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. 28అతడు కెరూబులను బంగారంతో పొదిగించాడు.
29గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు. 30అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు.
31గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి. 32ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు. 33అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది. 34అంతేకాక అతడు రెండు తలుపులు సరళవృక్షాల కర్రతో చేయించాడు, ఆ రెండిటికి రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. 35అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు.
36లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
37నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు. 38పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 6: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.