1 రాజులు 7

7
సొలొమోను తన రాజభవనాన్ని నిర్మించుట
1సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది. 2అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు,#7:2 అంటే, పొడవు 45 మీటర్లు, వెడల్పు 23 మీటర్లు, ఎత్తు 14 మీటర్లు నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు. 3స్తంభాల మీది దూలాల పైకప్పును దేవదారుతో చేశారు. ఒక్కో వరుసలో పదిహేను స్తంభాల చొప్పున మూడు వరుసల్లో నలభై అయిదు స్తంభాలు ఉన్నాయి. 4దాని కిటికీలు మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉంచారు. 5అన్ని తలుపుల, కిటికీల గుమ్మాలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి; అవి ముందు భాగంలో మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.#7:5 హెబ్రీ భాషలో ఈ వచనం యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు
6సొలొమోను స్తంభాలతో ఒక మండపాన్ని కట్టించాడు, దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్పై మూరలు, దానికి ముందు స్తంభాలతో కట్టిన వసారా ఉంది.
7అతడు తీర్పు తీర్చడానికి సింహాసన గదిని, న్యాయస్థాన గదిని కట్టించాడు. దానిని అడుగు నుండి పైకప్పు వరకు దేవదారుతో కప్పించాడు. 8దాని లోపలి ఆవరణంలో అతడు నివసించే రాజభవనాన్ని ఆ విధంగానే కట్టించాడు. సొలొమోను తాను పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెకు కూడా ఇలాంటి భవనాన్నే కట్టించాడు.
9ఈ నిర్మాణాలన్ని, బయట నుండి గొప్ప ఆవరణం వరకు, పునాది నుండి పైకప్పు వరకు, లోపల బయట సరియైన కొలతలతో ఇనుప పనిముట్లతో చెక్కిన విలువైన రాళ్లతో చేశారు. 10పునాదిని నాణ్యమైన పెద్ద రాళ్లతో వేశారు. వాటిలో కొన్ని పది మూరలు, కొన్ని ఎనిమిది మూరల#7:10 అంటే, 3.6 మీటర్లు రాళ్లు ఉన్నాయి. 11పైభాగంలో చెక్కబడిన విలువైన రాళ్లు, దేవదారు దూలాలు ఉన్నాయి. 12గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరపు లోపలి ఆవరణం కట్టినట్లే రాజభవనపు మండపం కూడా కట్టారు.
ఆలయ ఉపకరణాలు
13సొలొమోను రాజు తూరు నుండి హూరాము#7:13 హెబ్రీ హీరాము హూరాము అనే పేరును పలికే ఇంకొక విధానం; 40, 45 వచనాల్లో కూడా అనే అతన్ని పిలిపించాడు. 14అతని తల్లి నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు, అతని తండ్రి తూరు వాసి, ఇత్తడి పనిలో నైపుణ్యత కలవాడు. హూరాము అన్ని రకాల ఇత్తడి పనులలో జ్ఞానం, సామర్థ్యం, తెలివిగలవాడు. అతడు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి తనకు అప్పగించిన పని అంతా చేశాడు.
15అతడు రెండు ఇత్తడి స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు. 16ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు ఇత్తడి పీటలను కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు. 17స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో, ప్రతి పీటకు ఏడు అల్లిన గొలుసులను వేశాడు. 18ఆ స్తంభాలను మీది పీటలను అలంకరించడానికి చుట్టూ రెండు వరుసల దానిమ్మపండ్లు చేశాడు. 19మండపం స్తంభాల మీది పీటలపై నాలుగు మూరల ఎత్తు తామర పువ్వుల్లా చెక్కారు. 20ఆ రెండు స్తంభాల మీది పీటల మీద అల్లికపని ఉన్న గిన్నెలాంటి భాగం పైన రెండువందల దానిమ్మపండ్లు వరుసగా చుట్టూరా ఉన్నాయి. 21అతడు దేవాలయ మంటపంలో ఆ స్తంభాలను నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను#7:21 యాకీను బహుశ అర్థం ఆయన స్థిరపరచును అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు#7:21 బోయజు బహుశ అర్థం ఆయనలో బలము ఉన్నది. అని పేరు పెట్టాడు. 22ఆ స్తంభాల పైభాగాలు తామర పువ్వుల రూపంలో ఉన్నాయి. అలా స్తంభాలు కట్టే పని పూర్తి అయింది.
23అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.#7:23 అంటే, సుమారు 14 మీటర్లు 24దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ గుండ్రని పండ్లు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ గుండ్రని పండ్లను రెండు వరుసలుగా పోత పోశారు.
25ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి. 26అది బెత్తెడు#7:26 అంటే, సుమారు మూడు అంగుళాలు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో రెండువేల బాతుల#7:26 అంటే 44,000 లీటర్లు; కొన్ని ప్రతులలో ఈ వాక్యం లేదు నీళ్లు పడతాయి.
27అతడు కదిలే పది ఇత్తడి స్తంభాలను కూడా చేయించాడు; ప్రతి దాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు. 28ఆ స్తంభాలు ఇలా చేయబడ్డాయి: వాటికి ప్రక్క పలకలు ఉన్నాయి, ఆ పలకలు మధ్య చట్రాలు అమర్చారు. 29ఆ చట్రాల మధ్య ఉన్న పలకల మీద చట్రాల మీద సింహాలు, ఎడ్లు, కెరూబు ఆకారాలు ఉన్నాయి. సింహాలకు, ఎడ్లకు పైన క్రింద పూదండలు చెక్కారు. 30ప్రతి స్తంభానికి నాలుగు ఇత్తడి ఇరుసులతో పాటు ఇత్తడి చక్రాలు ఉన్నాయి. ప్రతి దానికి నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. వాటి ప్రతి వైపున పోతపోసిన పూదండలు ఉన్నాయి. 31స్తంభం పై భాగంలో దాని మూతి ఉంది. దాని మూతి గుండ్రంగా, ఒక మూర లోతు ఉంది. మూతి గుండ్రంగా ఉండి దాని ఎత్తు ఒక మూరన్నర. ఆ మూతి మీద కూడ చిత్రాలు చెక్కారు. దాని చట్రం గుండ్రంగా గాక, నలుచదరంగా ఉంది. 32చట్రాల క్రింద నాలుగు చక్రాలు ఉన్నాయి. వాటి ఇరుసులు స్తంభాలతో కలిపారు, చక్రాల అడ్డుకొలత మూరన్నర. 33ఈ చక్రాలు రథచక్రాల్లా చేశారు; వాటి ఇరుసులు, అంచులు, అడ్డు కర్రలు, చక్రం యొక్క మధ్య భాగాలు, అన్నీ పోత పనితో చేశారు.
34ప్రతి స్తంభానికి నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు ఉన్నాయి, వాటిని స్తంభాలతో కలిపి పోత పోశారు. 35స్తంభం పైన చుట్టూ జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు ఉంది. స్తంభం, దానిపై ఉన్న చట్రాలు, పలకలు ఒకటిగా పోత పోయబడ్డాయి. 36అతడు పలకల మీద, చట్రాల మీద స్థలమున్న ప్రతీ చోట కెరూబు, సింహాలు, ఖర్జూర వృక్షాల ఆకారాలను, వాటి చుట్టూ పూదండలతో పాటు చెక్కించాడు. 37ఈ విధంగా ఆ పది స్తంభాలు చేయించాడు, అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారము.
38తర్వాత అతడు పది ఇత్తడి తొట్లు చేయించాడు. ప్రతి తొట్టి అడ్డుకొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టిలో నలభై బాతులు#7:38 అంటే, సుమారు 880 లీటర్లు పట్టేది, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో తొట్టి పెట్టారు. 39అతడు దేవాలయానికి కుడివైపు అయిదు స్తంభాలను, ఎడమవైపు అయిదు స్తంభాలను పెట్టించాడు. నీళ్ల తొట్టెను దక్షిణం వైపు దేవాలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా పెట్టించాడు. 40అతడు కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు.
కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:
41రెండు స్తంభాలు,
ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు,
గిన్నెలాంటి పీటలను కప్పడానికి రెండు అల్లికలు,
42స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,
43పది పీటలు వాటిపై ఉన్న పది తొట్లు,
44నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,
45కుండలు, చేటలు, చిలకరించడానికి వాడే గిన్నెలు.
హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు. 46రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు. 47ఆ ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి సొలొమోను వాటిని తూకం వేయించలేదు; ఆ ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి లేదు.
48యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు:
బంగారు బలిపీఠం;
సన్నిధి రొట్టెలు పెట్టే బంగారు బల్ల;
49మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు);
బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు;
50అలాగే మేలిమి బంగారు పళ్లాలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు;
అనే అతి పరిశుద్ధ స్థలమైన గర్భాలయ తలుపులకు, మందిర ప్రధాన గది తలుపులకు, బంగారు బందులు చేయించాడు.
51రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి