పరమ 6
6
చెలికత్తెలు
1స్త్రీలలో అత్యంత అందమైనదానా,
నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు?
నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు
మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి.
యువతి
2నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు,
పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు,
తోటలో మందను మేపడానికి,
తామరలను ఏరుకోడానికి.
3నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు;
తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
యువకుడు
4నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు,
యెరూషలేములా మనోహరంగా ఉన్నావు,
జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.
5నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు;
అవి నన్ను వశపరచుకుంటాయి.
నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి
దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.
6నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న
గొర్రె మందలా ఉన్నాయి.
ప్రతిదీ జంటగా ఉన్నాయి.
వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
7నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు,
విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.
8అరవైమంది రాణులు,
ఎనభైమంది ఉంపుడుగత్తెలు,
అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు;
9కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే,
తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె,
తనను కన్నదానికి ఇష్టమైనది.
యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు;
రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు.
చెలికత్తెలు
10తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా,
సూర్యునిలా ప్రకాశవంతంగా,
నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
యువకుడు
11లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు
లోయలో నూతన చిగురులను చూడాలని,
ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో,
దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.
12నేను గ్రహించేలోపే,
నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది.
చెలికత్తెలు
13ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా;
తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా!
యువకుడు
మహనాయీము నాట్యాన్ని చూసినట్లు
మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమ 6: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.