పరమ 5
5
యువకుడు
1నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను;
నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను.
నేను తేనెతెట్టె తేనె తిన్నాను;
నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను.
చెలికత్తెలు
స్నేహితులారా, తినండి త్రాగండి;
ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.
యువతి
2నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది.
వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ:
“తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా!
నా పావురమా, నిష్కళంకురాలా.
నా తల మంచుకు తడిసింది,
రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”
3నేను నా వస్త్రాన్ని తీసివేశాను
దాన్ని మళ్ళీ ధరించాలా?
నేను నా కాళ్లు కడుక్కున్నాను
మళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా?
4నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే;
నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది.
5నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను.
నా చేతులు బోళముతో తడిసి,
నా వ్రేళ్ళ నుండి బోళం,
తలుపు గడియ మీదికి స్రవించింది.
6నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా,
ఆయన వెళ్లిపోయాడు.
నా ప్రాణం స్పృహ తప్పింది.
నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు.
నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు.
7పట్టణంలో గస్తీ తిరిగేవారు
నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు;
నా ముసుగును తొలగించారు,
వారు ప్రాకారం మీద కావలివారు.
8యెరూషలేము కుమార్తెలారా,
నా ప్రియుడు మీకు కనిపిస్తే,
ఆయనకు మీరు ఏమి చెప్తారు?
ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.
చెలికత్తెలు
9స్త్రీలలో అత్యంత అందమైనదానా,
ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి?
ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు,
ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి?
యువతి
10నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు,
పదివేలమంది కన్న గొప్పవాడు.
11ఆయన తల మేలిమి బంగారం;
ఆయనది ఉంగరాల జుట్టు,
కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.
12ఆయన నేత్రాలు
నదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి,
అవి పాలలో స్నానమాడినట్లున్నాయి,
ఆభరణాల్లా చెక్కబడ్డాయి.
13ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే
పరిమళ పడకల్లాంటివి,
ఆయన పెదవులు తామరలాంటివి
వాటిలో నుండి బోళం స్రవిస్తుంది.
14ఆయన చేతులు గోమేధికం పొదిగిన
బంగారు కడ్డీలు,
ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన
దంత కళాఖండము.
15ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన
పాలరాతి స్తంభాలు.
ఆయన రూపం లెబానోనులా,
దాని దేవదారు వృక్షాలలా ఉంది.
16ఆయన నోరు అతిమధురం;
ఆయన మనోహరము.
యెరూషలేము కుమార్తెలారా!
ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమ 5: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.