పరమ 2
2
యువతి#2:1 లేదా యువకుడు
1నేను షారోను పొలంలో పూసిన గులాబిని,
లోయల్లో వికసించిన తామర పువ్వును.
యువకుడు
2ముళ్ళ మధ్య తామర పువ్వులా
నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది.
యువతి
3అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా
నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు,
ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను,
ఆయన ఫలం నా రుచికి మధురము.
4నన్ను ఆయన విందుశాలకు నడిపించారు,
ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు.
5ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి,
ఆపిల్ పండ్లతో తినిపించండి.
ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను.
6ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు,
కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
7యెరూషలేము కుమార్తెలారా!
పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను:
సరియైన సమయం వచ్చేవరకు
ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
8వినండి! నా ప్రియుడు!
చూడండి! ఆయన వచ్చాడు,
పర్వతాల మీదుగా గంతులు వేస్తూ,
కొండల మీదుగా దూకుతూ.
9నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు.
చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి
కిటికీల గుండా చూస్తూ,
జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు.
10నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు,
నా ప్రియురాలా, లే,
నా సౌందర్యవతి, నాతో రా.
11చూడండి! శీతాకాలం గడిచిపోయింది;
వర్షాలు అయిపోయాయి.
12భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి;
పాడే రుతువు#2:12 లేదా ద్రాక్ష కొమ్మలను కత్తిరించే కాలము. వచ్చేసింది.
మన దేశంలో
పావురాల కూత వినిపిస్తూ ఉంది.
13అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది;
ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి.
నా ప్రియురాలా, లేచి, రా,
నా సౌందర్యవతి, నాతో రా.
యువకుడు
14బండ సందుల్లో,
పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా,
నీ ముఖాన్ని నాకు చూపించు,
నీ స్వరాన్ని విననివ్వు;
ఎందుకంటే నీ స్వరం మధురం
నీ ముఖం మనోహరము.
15నక్కలను పట్టుకోండి,
గుంట నక్కలను పట్టుకోండి
ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి,
మన ద్రాక్షతోట పూతకు వచ్చింది.
యువతి
16నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను;
తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.#2:16 లేదా గొర్రెలను మేపుతున్నాడు.
17తెల్లవారుజాము వచ్చి
నీడలు పారిపోకముందు,
నా ప్రియుడా, నా దగ్గరకు తిరిగి రా,
నీవు జింకలా దుప్పిలా
ఎగుడు దిగుడు కొండల#2:17 లేదా బేతేరు కొండలు. మీది నుండి చెంగు చెంగున రా.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమ 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.